- వచ్చే 6 నెలల్లో టిమ్స్, గాంధీ, నీలోఫర్తో పాటు ఉమ్మడి జిల్లాల జీజీహెచ్ ల్లో విస్తరణ
- రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగానే సర్జరీలు మంత్రి దామోదర్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో అడ్వాన్సుడ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. సామాన్యులకు సైతం అత్యున్నత నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే 90 శాతం సర్జరీలను ఉచితంగా అందిస్తున్నామని స్పష్టం చేశారు.
సనత్ నగర్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ లో నిర్వహించిన స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్ షాప్ ను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను పరిశీలించి, వైద్య నిపుణులతో చర్చించారు.
రోబొటిక్ సేవల విస్తరణ
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య సేవల బలోపేతానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఇప్పటికే రోబోటిక్ సర్జరీ సేవల్లో ముందంజలో ఉందన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో అనతికాలంలోనే 1,000 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి రికార్డు సాధించామన్నారు. త్వరలోనే ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్, టిమ్స్, గాంధీ, నీలోఫర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జీజీహెచ్‌లలోనూ అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. అధునాతన వైద్య విద్య, నైపుణ్యాల కోసం డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
హెల్త్ టూరిజం పాలసీ
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఉస్మానియా, టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు అదనంగా 40 వేలకు పైగా బెడ్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా విదేశీ రోగుల కోసం టిమ్స్ లో 100 స్పెషల్ బెడ్లను కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే క్యాన్సర్ కేర్, ట్రామా కేర్ పాలసీలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. కిడ్నీ బాధితుల కోసం ఇప్పటికే 102 డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తుండగా, కొత్తగా మరో 79 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రాన్ని అడ్వాన్స్‌డ్ రోబోటిక్ సర్జరీ సర్వీస్ హబ్ గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ వాణి, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ బీరప్ప, డాక్టర్ విమల థామస్, డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ, డాక్టర్ రాజ్ గజ్భియే తదితరులు పాల్గొన్నారు.
